అవినీతి ప్రిన్సిపాల్ పై శిక్ష పడకుండా విద్యాశాఖ అధికారుల కుట్ర?
అగ్రవర్ణ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన బి.సి. విద్యార్థిని "హైపర్ యాక్టివ్" అంటూ సిద్దిపేట డి.ఇ.ఓ. చలోక్తి
బదిలీ అయినా హుస్నాబాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా రిలీవ్ కాకుండా మెడికల్ లీవ్ లో శ్రీదేవి
సాధారణ బదిలీల సమయంలో గుట్టు చప్పుడు కాకుండా తప్పించుకునేందుకు యత్నం!
హుస్నాబాద్: సాక్ష్యాధారాలతో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న హుస్నాబాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవికి విద్యాశాఖ అధికారుల నిండు సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలలోకి వెళ్తే అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటులో అవినీతి జరిగినదని, తనకు నచ్చిన సంస్థలతో శ్రీదేవి ఒప్పందం కుదుర్చుకుని కమీషన్లు పంచుకున్నారని అన్ని సాక్షాధారాలతో గతేడాది 20.12.2021 రోజున సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం సిద్దిపేట డి.ఇ.ఓ. రవికాంత్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన అప్పటి హుస్నాబాద్ ఎం.ఇ.ఓ. అర్జున్ తన నివేదికను 22.04.2022 రోజున విద్యాశాఖ డైరెక్టర్ కు అందజేశారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే 7 నెలల సమయం గడిచినా ఇంతవరకు విద్యాశాఖ అధికారులు విచారణ నివేదికను బహిర్గతపర్చలేదు. అయితే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అటల్ ల్యాబ్ ఏర్పాటు చేశారని పేర్కొంటూ శ్రీదేవిని నిజామాబాద్ జిల్లా బాల్కొండ మోడల్ స్కూల్ కు బదిలీ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వటం, అనంతరం శ్రీదేవి హై కోర్టును ఆశ్రయించి బదిలీ ఆదేశాలు చెల్లవంటూ మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవటం మనకు తెలిసిన విషయమే.
కాగా పాఠశాలలో సరైన మౌలిక వసతులు లేవని ప్రిన్సిపాల్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన విద్యార్థిని "హైపర్ యాక్టివ్" అంటూ శ్రీదేవిని బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులలో విద్యాశాఖ డైరెక్టర్ పేర్కొనటం సర్వత్రా చర్చనీయాంశం అయినది. బాధిత విద్యార్థినిని ప్రిన్సిపాల్ కక్ష్య పూరితంగా వేధించారంటు అన్ని సాక్షాధారాలు సమర్పించినప్పటికీ.. విచారణను అడ్డుకున్నారని విద్యార్థిని పైన బురద చల్లటం, తండ్రి ప్రోద్బలంతోనే విద్యార్థిని వాంగ్మూలం ఇచ్చిందని శ్రీదేవికి ఇచ్చిన బదిలీ ఉత్తర్వులలో పేర్కొనటం మరో విశేషం. శ్రీదేవిని రక్షించేందుకు తన సామాజిక వర్గానికే చెందిన సిద్దిపేట డి.ఇ.ఓ. ఇందుకు పూర్తి సహకారం అందించినట్లు తెలుస్తోంది.
కాగా శ్రీదేవి పైన అనేకానేక ఆరోపణలు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులకు తెలియనివది కాదు. తప్పు చేసిన శ్రీదేవిని రక్షించేందుకే కోర్టులో చెల్లని బదిలీ ఉత్తర్వులు ఇచ్చారని ఆరోపణనలు వినిపిస్తున్నాయి. అయితే కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా శ్రీదేవిని హుస్నాబాద్ పాఠశాలలో కొనసాగమని ఇంకా విద్యాశాఖ నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అయినా హుస్నాబాద్ మోడల్ స్కూల్ కు తేది 20-06-2022 నుండి 02-07-2022 వరకు శ్రీదేవి హాజరు కావటం, అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టుకోవటం.. విద్యాశాఖ అనధికార అనుమతులు లేనిదే చోటు చేసుకుంటాయా! ఈ తతంగమంతా వెలుగులోకి వచ్చాక శ్రీదేవి మెడికల్ లీవ్ పైన వెళ్లారు. మోడల్ స్కూల్ సిబ్బందికి 317 జి.ఓ. అమలులోకి వచ్చాక కోర్టు ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ నుండి అధికారిక ఉత్తర్వులతో బయట పడి తనకు యే శిక్ష పడకుండా దగ్గర్లో ఉన్న మోడల్ స్కూలుకి పోస్టింగ్ తెచ్చుకోవాలని శ్రీదేవి లాబీయింగ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
వాస్తావానికి అటల్ ల్యాబ్ ఏర్పాటులో శ్రీదేవి అవినీతి చేసినట్లు సంపూర్ణ సాక్ష్యాధారాలున్నాయి. అవినీతి నిరూపితమైతే కనీస శిక్షగా సదరు ఉద్యోగిని విధుల నుండి తొలగించాలని ప్రభుత్వ నిబంధనలు కలవు. అయితే నకిలీ రశీదులు, నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్, నకిలీ రిపోర్టులు సమర్పించి గట్టెక్కేందుకు శ్రీదేవి పన్నాగం రచిస్తోందని తెలుస్తోంది. నెలలు గడిచినా శ్రీదేవి పైన విచారణ ఇంకా పూర్తి కాకపోవటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అంతేగాక బాధిత విద్యార్థిని తల్లి తండ్రులను రాజీ పడమని కొందరితో ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు మరో సమాచారం. తప్పు చేసినవారెవరైనా పశ్చాతాప పడి వేసిన శిక్షను అనుభవించాలే గానీ, అక్రమ దారిలో లాబీయింగ్ చేయటం, ఫిర్యాదు చేసిన వారి పైన ఒత్తిడి తేవటం శ్రీదేవికి ఉన్న మరో వికృత కళ.
ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి, అవకతవకలు బయట పడటం ఇదేమి కొత్త కాదు. అయితే అగ్రవర్ణ కులం వారికి ఒక నీతి, నిమ్న వర్గాల వారికి మరో నీతి కనిపిస్తుంది. తప్పు చేసిన ఉద్యోగులందరికీ ఏక రూప శిక్షలు పడటం లేదు. మొన్నటికి మొన్న హుస్నాబాద్ బాలికల పాఠశాల యందు బాలుడి పైన చేయి చేసుకున్నాడని ఒక ఉపాధ్యాయుడి పై ఒకే ఒక్క రోజులో విచారణ జరిపించి సస్పెండ్ చేసిన విషయం అందరికి తెలిసినదే. మరి మైనర్ బాలిక పైన శ్రీదేవి వేధింపులకు పాల్పడ్డారని అన్ని సాక్షాధారాలు ఉన్నప్పటికీ నెలలు గడిచినా ఇంకా ఎందుకని విచారణ పూర్తి కావడం లేదని తల్లి తండ్రులు, విద్యార్థులు, బహుజన సంఘాలు మండి పడుతున్నాయి. తప్పు చేసిన వారెవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే నని, ఇందుకు కులం గోత్రం ఏవి ప్రాతిపదిక కాకూడదని వారు హెచ్చరిస్తున్నారు. శ్రీదేవిని విద్యాశాఖ అధికారులు రక్షించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని, ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని బహుజన విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Post a Comment