భూమి---- రైతు
పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, సి కె న్యూస్ ప్రతినిధి
భూమి మరియు రైతు గురించి గండ్రాజుపల్లి రైతు భాగీరథి లక్ష్మీపతి మాటల్లో....
భారాన్ని మోసేది భూమి, భరించేది భూమి, బ్రతుకుతెరువుకు భూమి. భూమి లేనిదే బ్రతుకులేదు, బ్రతకలేము. భూమి పైన పుట్టాం. భూమిలోకి పోతాం.
రైతుకి భూమికి విడదీయరాని బంధం ఉంటుంది. రైతు జీవం భూమి. అతని ఊపిరి భూమి. పొద్దు పొద్దున్నే లేచి, అంత సంగటి ముద్ద తిని, చల్లని, పచ్చని మడి పైర్ల గాలులను పీలుస్తూ.... తడి మట్టి సువాసనలను ఆస్వాదిస్తూ... కల్మషాలు లేని కారు మబ్బులను ఆహ్వానిస్తూ.... అందరి నోటికి అంత బువ్వ అందించే రైతు రాజు అయ్యేనా?
ఒకప్పట్లో ఇంట్లో ధాన్యం ఉంటే వాడికేం రా వాడి ఇంట్లో సంవత్సర భత్యం ఉంది! అనేవారు. ఎర్ర గంజి కోసం పనిచేసిన రోజులూ ఉన్నాయి. ప్రచ్చన్న నిరుద్యోగితతో కొట్టుమిట్టాడిన కాలాలు ఉన్నాయి.
దేశంలో నూటికి 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు అని అంటారు. కానీ రైతుకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామా? అని ఒకసారి ఆలోచన చేస్తే...
రైతు లేని జీవితాన్ని ఊహించలేం. బంగారు పంటలు పండించే భూములను పారిశ్రామిక అవసరాలకు ఇచ్చి, పరిహారాలు రాక, ఈరోజు రోడ్డుపైన ధర్నాలు చేస్తున్న రైతులకు మనం ఎంత ప్రాధాన్యమిస్తున్నాం అనే విషయం అర్థం అవుతుంది.
ఏది ఏమైనా రైతే రాజు. రైతే దేశానికి వెన్నెముక. అనే మాటను మాటల్లో కాక ,చేతలో నిరూపించినప్పుడే, రైతుకు తగిన ప్రాధాన్యం ఇవ్వగలిగినప్పుడే అన్ని రంగాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది .ఇది కాదనలేని వాస్తవం.
Comments
Post a Comment