లంచాలివ్వలేం.. ఆత్మహత్య చేసుకుంటాం

లంచాలివ్వలేం.. ఆత్మహత్య చేసుకుంటాం: ఎంపీడీఓ ఆఫీస్ ముందు భార్యాభర్తల ఆందోళన..

హబూబాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు రావడం లేదని లబోదిబోమంటున్నారు.

ఆఫీసుల చుట్టూ తిరగలేక నరకయాతన అనుభవిస్తున్నారు. తాము పెట్టిన పెట్టుబడి కూడా తమకు తిరిగి రాకపోవడంతో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఎంపీడీవో కార్యాలయం ముందు ఇంకుడు గుంతల పనులు చేసి బిల్లుల కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ఓ భార్యాభర్తలు వినూత్న నిరసన చేపట్టారు.

లంచం ఇవ్వలేమని వినూత్న నిరసన తెలిపిన ఓ భార్యాభర్తలు

కేసముద్రం మండలం ఎంపీడీవో కార్యాలయం ముందు భార్యాభర్తలు పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకొని, లంచాలు ఇవ్వలేమని, ఆత్మహత్య చేసుకుంటామని ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. బాధితుడు చందు తెలిపిన వివరాల ప్రకారం కేసముద్రం మండలంలోని కోమటిపల్లి గ్రామ శివారు కు చెందిన చందు సుమారు 4 లక్షల రూపాయల వ్యయంతో, పెట్టుబడి పెట్టి 280 ఇంకుడు గుంతలు తీసినట్టు పేర్కొన్నారు. ఈ ఇంకుడు గుంతలు తాలూకా బిల్లులు తనకు చెల్లించవలసి ఉండగా ఇంతవరకు ఇవ్వకుండా, అధికారులు రెండు సంవత్సరాలుగా తిప్పుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఇంకుడు గుంతల బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ

రెండేళ్లుగా ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఇంతవరకు అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదని మండిపడ్డారు. కంప్యూటర్ ఆపరేటర్ సుస్మిత, ఎంపీడీవో రోజా రాణి ల పై అవినీతి ఆరోపణలు చేశారు బాధితుడు చందు. తమకు న్యాయం చేసి బిల్లులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. గిరిజనులం కావడంతోనే తమ పైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని చందు ఆరోపించారు.

లంచం కోసం అధికారులు వేదిస్తున్నారన్న బాధితుడు

లంచం కోసం అధికారులు వేదిస్తున్నారని, లంచం ఇవ్వలేక తాము భార్యా భర్తలం ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటామని చందు పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ బిల్లు తమకు ఇప్పించాలని వారు వాపోయారు. నా ఇంకుడు గుంతల చెక్కు ఇప్పించండి మహాప్రభో అంటూ ప్రాధేయ పడుతున్నారు. తనకు పేమెంట్ చేయకుండా ఇంత కాలం ఇబ్బంది పెడుతున్న సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని చందు డిమాండ్ చేశారు.

జోక్యం చేసుకుని నిరసన విరమింపజేసిన పోలీసులు

ఇక ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని, బిల్లుల విషయంలో సదరు అధికారులతో మాట్లాడతామని నచ్చచెప్పి వారిని నిరసన విరమింపజేశారు. ఇప్పటికైనా తమ బిల్లును ఇవ్వకుంటే తాము అన్నంత పని చేస్తామని చందు దంపతులు హెచ్చరిస్తున్నారు. అయితే అధికారులు తాము ఎలాంటి లంచం డిమాండ్ చెయ్యలేదని, కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పటం గమనార్హం.

Comments