జోరుగా అనుమతి లేని వాహనాల అంగడి

 జోరుగా అనుమతి లేని వాహనాల అంగడి

- పర్మిషన్ లేకుండానే దళారి దందా

- అక్రమ అంగడిని అడ్డుకొని అధికారులు

- ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోని దళారులు

- ఇలాంటి దందా మా పరిధిలో లేవు..?  అధికారుల వైఖరి..!

సీకే న్యూస్ కామారెడ్డి


చెప్పుతున్నదొక్కటి చేస్తుంది మరోకటి, అన్నట్టు జిల్లా కేంద్రంలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయానికి కుతపెట్టు దూరంలో కొత్త బస్టాండ్ ఎదురుగా సిఎస్ఐ స్కూల్ గ్రౌండ్ ఆవరణలో వాహనాల అంగడి నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వాహనాల అంగడి పేరుతో ప్రతి గురువారం జిల్లా కేంద్రంలో టెంటు (షామియా) ఏర్పాటు చేసి ఓ నాలుగు కుర్చీలు వేసి బాధితులు అమ్ముకునే వాహనాలకు స్టిక్కర్లు పెట్టి క్రయ,విక్రయాలు జరిపే చీకటి దందా ను కొందరు కొనసాగిస్తున్నారు.  మోసపోతున్న వాహనదారులు, పేరుకి పాత వాహనాలు, అమ్మడం కొనడం అనే పేరుతో వెలసిన మార్కెట్, ఈ మార్కెట్ ద్వారా ప్రభుత్వానికి వేల రూపాయల ఆదాయానికి గండి పడుతుంది. ఈ దందా కి మున్సిపల్ పర్మిషన్ గాని ఆర్టిఏ పర్మిషన్ గాని లేవు అని చెప్పవచ్చు.. అదేవిధంగా వాహనానికి వేసే స్టిక్కర్ పైన రిజిస్టర్ నంబర్ లేకపోవడం గమనార్హం. ముఖ్య విషయం పాత వాహనాలు అమ్మడం కొనడం అనే షాప్ పేరు మీద తీసుకున్న లైసెన్స్ లతో సీఎస్ఐ స్కూల్ పాఠశాల ఆవరణానికి సంబంధించిన ప్రాంతంలో గురువారం వాహనాల అంగడి అనే పేరుతో వ్యాపారాన్ని కొనసాగిస్తుండడం పై అధికారులు ఎలాంటి చట్టబద్ధమైన నిబంధనలు ఎందుకు తీసుకోవడం లేదు.  ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విషయం పైన ఎందుకు స్పందించకుండా ఉన్నారు..! బాధితులు అవసరానికి ఏదో ఒక రేటుకు అమ్మిన వాహనాలను ఈ సంస్థను మార్కెట్ను నిర్వహిస్తున్న వాళ్లే ఏదో ఒక రేట్ కు కొనుగోలు చేసి, ఆ వాహనాలను తిరిగి వాటిని ఎక్కువ రేటుకు అమ్ముతున్నరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా,వాహనంపై స్టిక్కర్ వేసినందుకు 50 రూపాయలు చెల్లించాలి, అదేవిధంగా వాహనం అమ్ముడుపోతే టూ సైడ్ కమిషన్ ఇరువైపులా 1000/- కమిషన్ పేరుతో వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా వాహన పత్రాలు సరిగా లేకున్నా అమ్మడం కొనడం ఈ తలారులు జరిపిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా చేస్తే లబ్ధిదారులు మోసపోయిన వారు చాలామంది బాధితులు ఉండడం గమనార్హం..!

తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా గత కొన్ని ఏళ్లుగా ప్రతి గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో చర్చి గ్రౌండ్లో పాత వాహనాలు అమ్మడం కొనడం కోసం వారంలో ఒక గురువారం రోజు మార్కెట్ను ఏర్పాటు చేస్తారు. కామారెడ్డి జిల్లా ప్రజలే కాకుండా మెదక్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వారు సైతం ఈ వాహనాలను కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున ఈ బజారుకు వస్తున్నారు. ఈ ద్విచక్ర వాహనాల వ్యాపారం నిర్వహించే కొందరు వినియోగ దారులకు మోసం చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. వాడిన ద్విచక్ర వాహనాలకు ఒక్కొక్క వాహనానికి... ఒక్కొక్క ధరను నిర్ణయిస్తూ.. ఆ ధర ప్రకారమే వాహనాలను కొనుగోలు దారులకు ఇవ్వాల్సి ఉండగా నిర్వహకులు తమకు ఇష్టం వచ్చినట్లు కొనుగోలు దారుల నుంచి డబ్బులను దండుకుంటూ వారిని నిలువు దోపిడి చేస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో ఏది లేకున్న ద్విచక్ర వాహనం వినియోగం తప్పనిసరిగా మారింది. ఆర్థికంగా వెనుక బడిన వారు పాత వాహనాలను తక్కువ ధరకు వస్తాయని, వారు ఈ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కొత్త వాహనాలు కొనాలంటే రూ. లక్షల వరకు వాహనాలకు రేట్లు ఉండగా, ఆర్థికంగా వెనుకబడిన వారు పాత వాహనాలను కొనడానికి ఆసక్తి ఉన్నవారు యొక్క అవసరాన్ని  ఆసరాగా తీసుకున్న నిర్వహకులు కొనుగోలు దారులకు చెప్పిన ధర కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. కాగితాల ఖర్చు.... రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చులు ఉన్నాయంటూ.. అదనంగా వారి నుంచి దండుకుంటున్నారు. ఏమి తెలియని వ్యక్తులు ఈ నిర్వహకుల మోసాలకు గురై ఆర్థికంగా నష్టపోతున్నారు. కొనుగోలు చేసిన వాహనం సక్రమంగా ఉందా..? లేదా..? అనే బాధ్యత నిర్వహకులకు పట్టింపు లేదు. అంగడి బజార్ నుంచి కొనుగోలు చేసుకొని వెళ్లిన వ్యక్తిదే పూర్తి బాధ్యత అంటూ నిర్వహకులు నమ్మించి వారికి అప్పగిస్తున్నారు. ఈ అంగడి బజార్లో కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాలు కొన్ని రోజులకే మరమ్మతులకు రావడంతో వాటి కోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తుందని కొనుగోలు దారులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లో మెదక్ జిల్లా అల్లాందుర్గాకు చెందిన కాసీం అనే యువకుడు అంగడి బజార్లో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయడానికి నిర్వహకులతో ధర నిర్ణయించుకున్నారు. వాహనం ధర రూ.26వేలు చెప్పి, ఆ డబ్బులు చెల్లించిన తరువాత అదనంగా ఇతర ఖర్చులంటూ మరో రూ. 3వేలకు పైగా దండుకోవడంతో నిర్వహకుల తీరుపై ఖాసీం ఆ నిర్వహకులతో వాగ్వాద పడ్డారు. ఇది ఈ ఒక్క ఖాసీం పరిస్థితే కాకుండా ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులను ఈ నిర్వహకులు ఇలానే మోసగిస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు ఈ అంగడి బజార్పై దృష్టి పెట్టి, ఈ మోసాలను అరికట్టాల్సిన అవసరం ఏంతైనా ఉంది.

Comments