గాల్లోకి కాల్పులు జరిపిన టీఆర్ఎస్ నేతలు: పోలీసుల విచారణలో ఏం తేలిందంటే?
హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన మరువకముందే మరో ఇద్దరు టీఆర్ఎస్ నాయకులు అదే పనిచేశారు. తుపాకులతో ఇద్దరు టీఆర్ఎస్ నాయకులు గాల్లోకి కాల్పులు జరుపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్ సమీపంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో టీఆర్ఎస్వీ కందుకూరు అధ్యక్షుడు విఘ్నేశ్వర్ రెడ్డి, మరో నాయకుడు విక్రమ్.. తుపాకీతో కాల్పులు జరిపి ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వీడియో వైరల్ అయ్యింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. కందుకూరు మండలం దెబ్బగూడకు చెందిన జిట్టా రవీందర్ రెడ్డికి యాచారం మండలం నజ్దిక్ సింగారం రెవెన్యూ పరిధిలో ఫాంహౌస్ ఉంది. ఇందులో కందుకూరుకు చెందిన యువకులు అప్పుడప్పుడు విందులు చేసుకుంటుంటారు.
అయితే, జులై 14న ఏర్పాటు చేసిన విందులో విఘ్నేశ్వర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి సహా 15 మంది యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి తన వద్ద ఉండే ఎయిర్ గన్‌ను బయటకు తీసి మిత్రులకు చూపాడు. దాన్ని తీసుకుని కొందరు గాలిలోకి కాల్పులు జరుపుతూ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.
ఆ వీడియోలను అదే రోజు వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకుని కొద్ది సేపటి తర్వాత తీసేశారు. అయితే, అందులోని వీడియో ఒకటి సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు.
ఆ ఫాంహౌస్‌ను యాచారం సీఐ లింగయ్య పరిశీలించి, అక్కడున్న ఎయిర్ గన్(మోడల్-35), పిల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గన్ కొనుగోలు చేసిన పత్రాలను పరిశీలించారు. పక్షులు, అడవి పందులు పంట ధ్వంస చేయకుండా రక్షించుకోవడానికి ఎయిర్ గన్‌ను కొనుగోలు వాడుతున్నట్లు జిట్టా రవీందర్ రెడ్డి చెప్పారు. మారణాయుధాల చట్ట(ఆర్మ్ యాక్ట్) పరిదిలోకి ఎయిర్ గన్ రాదని సీఐ లింగయ్య వెల్లడించారు.
Comments
Post a Comment