అక్రమ మట్టి రవాణాను అరికట్టాలి..?
-- కాలనీల్లో అర్ధరాత్రి ట్రాక్టర్లు, లారీలతో పెద్ద పెద్ద శబ్దాలు
-- ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులు
-- ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీస్ అధికారులు
-- విలేకరుల సమావేశంలో బాధితుల ఆవేదన
ఖమ్మం, ఆగస్టు 25 : నగరంలోని 8వ డివిజన్లో సంవత్సరంన్నర కాలంగా ప్రభుత్వ భూముల్లోని మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ ప్రశ్నించినవారిపై దాడి చేయడం, చంపుతామంటూ బెదిరిస్తున్నవారిపై అనేకమార్లు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని బాణోత్ గోపి ఆరోపించాడు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గోపి మాట్లాడుతూ... 8వ డివిజన్లోని ఎల్ బి నగర్ కు చెందిన వాంకుడోత్ సురేష్ అర్ధరాత్రి వేళ ట్రాక్టర్లు, ట్రిప్పర్లతో ప్రభుత్వ భూముల్లోని మట్టిని అక్రమ రవాణా చేస్తూ, కాలనీలో సైడ్ కాలువ పేరుతో తీసిన మట్టిని కూడా అమ్ముకొని అలానే వదిలేస్తున్నాడని ఆవేదన వ్యక్తంచేశాడు. రాత్రి వేళ భారీ శబ్దాలతో వావానాలు తిరుగుతూ ఉంటే ప్రశ్నించిన తనపై ట్రాక్టర్, లారీ డ్రైవర్లు, సురేష్ వద్ద పనిచేసే రమేష్, యాకయ్య, మోహన్లతో పాటు మరికొంతమంది దాడిచేసి కొడితే తలకు గాయాలు, వెన్నుపూసకు దెబ్బలు తగిలి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. మైనింగ్, రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడంలేదన్నాడు. డ్రైవర్లు, అక్కడ పనిచేసే సుమారు 20మంది మద్యం మత్తులో ఎవరు ప్రశ్నించిన వారిపై బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని, భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ఆడవారిని కూడా చూడకుండా మీది మీదికి వచ్చి బెదిరిస్తున్నారని ఎల్ బి నగర్ కు చెందిన అరుణ, కమాలి ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులు స్పందించి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాత్రివేళ 7 నుండి 9 గంటల వరకు పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని, అక్రమ రవాణా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Post a Comment