🔶 ఖమ్మం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్మెంట్ మార్చాలి
🔶 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో నామ భేటీ
🔶అలైన్మెంట్ మార్పు ప్రజల ఆకాంక్ష : నామ
🔶 ఖమ్మం నూతన కలెక్టరేట్ కు 5 కి. మీ. దూరంలో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించాలి
🔶 కల్లూరు మండలం-లింగాల, వేంసూర్ వద్ద ఎంట్రీ, ఎగ్జిట్స్ ఏర్పాటు చేయాలి
🔶రోడ్ల విస్తరించి, కాల్వలు నిర్మించాలి
🔶అవసరమైన నిధులు విడుదల చేయాలి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 21 : ఖమ్మం జిల్లాలో నిర్మితమవుతున్న జాతీయ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం గురించి బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర జాతీయ రహదారులు, హైవేస్ అభివృద్ధి శాఖా మంత్రి నితిన్ జయరామ్ గడ్కరీతో అర్ధగంటకు పైగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్ ఫీల్డ్ రహదారికి సంబంధించి వలు అంశాల పై కూలంకషంగా సుదీర్ఘంగా చర్చించి, నితిన్ గడ్కరీకి వివరించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజల ఆకాంక్షలు, సూచనలను పరిగణలోకి తీసుకుని, ఖమ్మం సమీకృత కలెక్టేట్ సముదాయం వద్ద నిర్మితమవుతున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి అలైన్మెంట్ ను మార్చాలని, ఈ రహదారిని ఖమ్మం నగరానికి 5 కిలో మీటర్లు దూరంలో నిర్మించాలని ఎంపీ నామ నితిన్ గడ్కరీని ఈ సందర్భంగా కోరారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధి ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు, బల్లేపల్లి, ఖమ్మం రూరల్ మండలం తీర్థాల, కామంచికల్లు, దారేడు, రేగుల చలక, రఘునాథపాలెం, వి.వెంకటాయపాలెం మీదుగా నిర్మిస్తున్న ఈ జాతీయ రహదారి ఖమ్మం సమీకృత కలెక్టరేట్ దగ్గరగా వెళతుందని, దీనిని 5 కిలో మీటర్ల దూరంలో నిర్మించడం వల్ల ఈర్లపూడి, మంగళగూడెం, కోటపాడు, తీర్థాల వంటి చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఖమ్మం నగరం ఎంతో అభివృద్ధిని సాధిస్తాయని నామ కేంద్ర మంత్రికి వివరించారు.గ్రీన్ ఫీల్డ్ రహదారి అలైన్మెంట్ను మార్పు చేసి, సమీకృత కలెక్టరేట్ నుంచి 5 కిలో మీటర్ల దూరం నుంచి నిర్మించడం వల్ల ఈనాడు కార్యాలయం – రఘనాథపాలెం రోడ్డును కూడా జాతీయ రహదారిగా మార్చడానికి అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా కోదాడ - - కొరవి రహదారిని కూడా జాతీయ రహదారిగా మార్పు చేయడానికి సులభతరం అవుతుందని నామ వివరించారు. అంతేకాకుండా భూసేకరణ వ్యయం కూడా బాగా తగ్గుతుందని నామ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని, గ్రీన్ ఫీల్డ్ రహదారి అలైన్మెంట్ మార్చాలని కోరుతున్నామని నామ కేంద్ర మంత్రికి వివరించారు. దీనిని స్పెషల్ కేసుగా పరిగణించి, గ్రీన్ ఫీల్డ్ రహదారి అలైన్మెంట్ మార్పు చేసేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని నామ నితిన్ గడ్కరీని కోరారు.
🔶 రెండు చోట్ల ఎంట్రీ , ఎగ్జిట్స్ ఏర్పాటు చేయాలి.
ఖమ్మం - అశ్వారావుపేట జాతీయ గ్రీన్ ఫీల్డ్ (ఎన్ హెచ్ 365బిబి) రహదారి అంతర్భాగంగా ఖమ్మం - దేవరపల్లి (ఎన్హెచ్365బిజి) రహదారిని 125 కిలో మీటర్ల మేర జాతీయ గ్రీన్ ఫీల్డ్ రహదారిగా నిర్మిస్తున్నారని తెలిపారు. ఇది హైదరాబాద్ - విజయవాడ (ఎన్హెచ్ 65 ), జగిత్యాల - కరీంనగర్ - వరంగల్ - ఖమ్మం (ఎన్హెచ్ 563 ) జాతీయ రహదారులను కలుపుతుందని తెలిపారు. అంతేకాకుండా కాకినాడ పోర్టు, చత్తీస్గఢ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక కారిడార్లకు కూడా ప్రధాన అనుసంధాన రహదారిగా కూడా ఉంటుందని నామ చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న సత్తుపల్లి పట్టణం బొగ్గు, ఇతర పరిశ్రమలతో వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వేంసూరు, సత్తుపల్లి పట్టణాలు, మండలాలు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వైద్యం, ఇతర అవసరాల కోసం విజయవాడ - రాజమండ్రి, హైదరాబాద్ నగరాలకు వెళ్లే క్రమంలో గ్రీన్ ఫీల్డ్ రహదారిని చేరుకోవడానికి 30 నుంచి 40 కిలో మీటర్ల దూరం అవుతుందన్నారు. ఇది ప్రజలకు భారం కావడంతో పాటు పర్యవరణ సమస్యలు కూడా ఏర్పడతాయని, అనవసరమైన ఇందన వృధా కూడా అవుతున్నందున కల్లూరు మండలంలోని లింగాల గ్రామం వద్ద, వేంసూరు మండలంలో రెండు ఎంట్రీ, ఎగ్జిస్ట్ ప్రొవిజన్ ను ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని నామ కోరారు. ప్రజా ప్రతినిధులు, రైతులు, ప్రజలు, భూనిర్వాసితుల అభ్యర్ధన మేరకు ఎంట్రీ, ఎగ్జిట్స్ ఏర్పాటుకు సత్వర చర్యలు. తీసుకోవాలని కోరుతున్నామని నామ కేంద్ర మంత్రికి వివరించారు.
🔶రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేయాలి
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నూతనంగా నిర్మితమవుతున్న ఖమ్మం - అశ్వారావుపేట (ఎన్ హెచ్ 365 బిబి ) గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి 60 కిలో మీటర్ల మేర తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి మీదుగా నిర్మితమవుతున్నదని తెలిపారు. ఇది హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, తదితర జిల్లాలను కలపడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని నార్తన్ కోస్టల్ డిస్ట్రిక్ట్ లను కూడా కలుపుతుందన్నారు. అంతేకాకుండా వైజాగ్, కాకినాడలను అనుసంధానిస్తుందన్నారు. గ్రానైట్, బొగ్గు, మిషనరీ వాహనాల రాకపోకల వల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుందని అన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పినపాక, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి. లంకపల్లి,సత్తుపల్లి మార్గంలో అలైన్మెంట్లో ఎటువంటి మెరుగుదల పనులు చేయకపోవడం వల్ల గ్రీన్ ఫీల్డ్ రహదారిలో కూడా అదే ట్రాఫిక్ సమస్య అధికంగానే ఉంటుందన్నారు. సింగరేణి ఉపరితల బొగ్గు గనులు, వ్యవసాయం, వేగవంతమైన పట్టణీకరణ వల్ల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. భూసేకరణ తదితర సమస్యలు వల్ల 4 నుంచి 6 ఏళ్ల సమయం పడుతుందన్నారు. అందు వల్ల పట్టణాల పరిధిలో రోడ్లను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. కల్లూరు పట్టణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని, అంతేకాకుండా నాలుగు లైన్ల రహదారిగా ఉందన్నారు. అందు వల్ల స్ట్రెచ్ విస్తరణ, కాలువల నిర్మాణాన్ని మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం మొత్తం అన్ని చోట్లా కలిపి సుమారు రూ.266 కోట్లు దాకా అవసరం ఉంటుందని నామ కేంద్ర మంత్రికి వివరించారు. అలాగే పినపాక, తల్లాడ ల్లో వాణిజ్యపరంగానే కాకుండా మామిడి ఇతర వాణిజ్య పంటల ఆధారిత పరిశ్రమలు అధికంగా ఉన్నందున ఆ పట్టణాల్లో కూడా రోడ్లను విస్తరించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం రూ.40 కోట్లు అవసరం ఉంటుందని అన్నారు. పెనుబల్లి నుంచి లంకపల్లి లో బొగ్గు, మామిడి, ఇతర వాణిజ్య ఆధారిత పరిశ్రమలు అధికంగా ఉన్నందున అక్కడ కూడా రోడ్లను విస్తరించాలన్నారు. ఇందుకోసం రూ.65 కోట్లు అవసరం ఉంటుందని తెలిపారు. అలాగే సత్తుపల్లి పట్టణ పరిధిలో రోడ్ల విస్తరణకు రూ. 40 కోట్లు దాకా అవసరం ఉంటుందని నామ కేంద్ర మంత్రికి వివరించారు. అలాగే బేతుపల్లి, గంగారంలో రోడ్ల విస్తరణకు, డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి రూ. 66 కోట్లు దాకా అవసరం ఉంటుందని నామ చెప్పారు. ఆయా పట్టణాల్లో రోడ్లు విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలను కూడా నివారించవచ్చని తెలిపారు. దృష్టికి తీసుకొచ్చిన అన్ని రకాల సమస్యలను సత్వరమే పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి, సమన్యలను పరిష్కరించాలని నామ కేంద్రమంత్రిని కోరారు.
Comments
Post a Comment