భూ హక్కుదారులం మేమే.. న్యాయం చేయండి

 భూ హక్కుదారులం మేమే.. న్యాయం చేయండి

--- స్థలం ఒకచోట నిర్మాణాలు మరోచోట

--- భూ ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోండి

--- విలేకరుల సమావేశంలో బాధితులు ఉప్పెర్ల కొండలరావు, జిల్లెపల్లి సైదులు



ఖమ్మం, డిసెంబర్ 13 : ఖమ్మం నగర పరిధిలోని సీక్వెల్ రిసార్ట్స్ సమీపంలో సర్వేనెంబర్ 235 లో 804 గజాలు గల తమ సొంత స్థలములో కొందరు వ్యక్తులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బాధితులు ఉప్పెర్ల కొండల్ రావు, జిల్లేపల్లి సైదులు ఆరోపించారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... నగరంలోని సీక్వెల్ రిసార్ట్స్ సమీపంలో గల సర్వేనెంబర్ 235 లో 804 గజాల స్థలమును ఉప్పెర్ల కొండల్ రావు, జిల్లేపల్లి సైదులు, ఎం కిషోర్ కుమార్ అనే ముగ్గురం కొనుగోలు చేసి ఖమ్మం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని హక్కుదారులుగా ఉన్నామన్నారు. ఈ స్థలంపై ఎటువంటి సంబంధంలేని డాక్టర్ మోపర్తి సురేష్ బాబు, డాక్టర్ పూర్ణిమ, పుట్టగుంట శ్రీనివాస్ బాబు అనే వ్యక్తులు కొందరు గుండాలు, రౌడీలు, ప్రైవేటు వ్యక్తులను మోహరించి తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూమి సర్వే నెంబర్ 235. మా స్థలం పైకి వచ్చే వారి సర్వే నెంబర్ 237 అని తెలిపారు. మా సర్వే నెంబర్ కు వాళ్ల సర్వే నెంబర్ కు ఎటువంటి సంబంధం లేదని తెలిసినప్పటికీ నిర్మాణం చేపట్టేటప్పుడు సర్వే చేయించకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టిస్తూ.. పలుకుబడి ఉందని, ఏమి చేయలేమని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. అంతటితో ఆగకుండా రాత్రికి రాత్రే అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తూ తమకు చెందిన రిజిస్ట్రేషన్ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీనిపై జరిగిన పరిణామాలపై ఈ నెల 7న ఖమ్మం 1వ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. నగరపాలక, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ అధికారులతో పాటు కొందరి పోలీస్ సిబ్బందిని పక్కదారి పట్టించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా ఆక్రమణ దారులకు సహకరించే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తమది కానీ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. సర్వే నెంబర్ 237 లో పర్మిషన్ తీసుకొని పక్కనే ఉన్న మా స్థలం సర్వే నెంబర్ 235 లో నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు నిలిపివేసి, 'రీ' సర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని బాధితులు విలేకరుల సమావేశంలో వేడుకున్నారు.

Comments