బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం చారిత్రాత్మకం

 *బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం చారిత్రాత్మకం*


*బీఆర్‌ఎస్‌ జిల్లా సీనియర్ నాయకులు బాదావత్ లక్ష్మణ్ నాయక్*


రాజకీయాలు కాదు ప్రజాకీయాలు కావాలన్న కాళోజీ ఆకాంక్షను అందిపుచ్చుకుని తెలంగాణ స్ఫూర్తితో పరివర్తనా ప్రవక్త కేసీఆర్‌ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించడం భారత రాజకీయాలలో ఒక నవశకం అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు బాదావత్ లక్ష్మణ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కూసుమంచి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ మూస విధానాలు, రోత రాజకీయాలతో దేశ ప్రతిష్ఠను దిగజార్చే కుత్సిత పాలకుల గుండెలు గుభేల్‌మనే రీతిలో సుప్రీం లీడర్‌ కేసీఆర్‌ యుద్ధభేరి మోగించారని, విద్వేష విష రాజకీయాలతో దేశం పతనమవుతున్న వేళ, మోదీ పరివారం వికృత చేష్టలతో వ్యవస్థలు కుప్పకూలిపోతున్న వేళ, విపక్షం నిర్వీర్యమై రాజకీయ శూన్యం కొనసాగితే దేశ మనుగడ, ప్రజాస్వామిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని పసిగట్టిన కేసీఆర్‌ వేగంగా స్పందించిన ఫలితమే భారత రాష్ట్ర సమితి అని ఉద్ఘాటించారు. అట్టడుగు సమాజమంతా అట్టుడికిపోతున్న ప్రమాదకర పరిస్థితిలో, తమ రక్షణ కోసం నేనున్నానంటూ కదిలే ధీరోదాత్తుడి కోసం దేశ జనులు ఎదురు చూస్తున్న విషమ ఘడియలో, కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌కు ఆయువు పోశారు. 

ఎడారిగా మారిపోయి, వలసలు పెరిగిపోయి, మంచినీరు కూడా దొరకని తెలంగాణ ప్రాంతమే ఎనిమిదేండ్లలో ఇంత బాగా అభివృద్ధి చెందగలిగితే భారతదేశం రత్నగర్భ, అద్భుతమైన, అపారమైన మానవ సంపద, ప్రపంచంలోనే ఏ దేశానికి లేని అనుకూలతలు ఉన్న దేశం ఇంకెంత అభివృద్ధి చెందాలి అని కెసిఆర్ ఆలోచనతో దేశ రాజకీయాల్లో అడుగు పెట్టడం చాలా గోప్ప పరిణామం. తెలంగాణలో మార్పును చూసినట్టే దేశంలోనూ పరివర్తన చూడబోతున్నామని ఎనిమిదేళ్ల కాలంలో ప్రపంచం మొత్తం తెలంగాణను చూసే విధంగా అభివృద్ధి పరిచిన కేసీఆర్ గారు భారతదేశాన్ని కూడా అదే రీతిలో అభివృద్ధి పరుస్తారని లక్ష్మణ్ నాయక్ తెలియజేశారు

Comments