*దున్నపోతు ఈనింది అంటే దూడను దొడ్లో కట్టెయ్యమన్నాడట దొరగారు*
*జర్నలిస్ట్ ల ఇళ్లస్థలాల విషయం లో ఒక నిస్ఫాక్షిక అభిప్రాయం*
జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కావాలని జర్నలిస్టులు... ఇవ్వాలని నాయకులు తాపత్రయ పడుతున్న విషయం విదితమే... తుమ్మల, కందాల, పువ్వాడ, సండ్ర ఇలా ఎంతోమంది జర్నలిస్ట్ ల పక్షాన జిల్లా మీటింగులు మొదలుకొని, అసెంబ్లీ వరకు అరిచి గీ పెట్టిన నాయకులు వున్నారు. కానీ కార్యరూపం ఎందుకు దాల్చలేదు. కొన్ని కోట్ల రూపాయల పనులు చేయించగలిగిన మాజీ మంత్రి తుమ్మల, పోచారం శ్రీనివాస్ రావు లా తెగింపు చేసి ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాడా ? ఖమ్మం జిల్లాను సర్వతోముఖాభివృద్ది చెయ్యాలని తపన పడుతున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి జర్నలిస్ట్ ల ఇంటి స్థలాల సమస్య ఓ లెక్క నా ? అసలు ఉన్న జర్నలిస్ట్ లల్లో ఖమ్మం కేంద్రంగా పనిచేసే, అక్రిడిటేషన్ కార్డ్ ఉన్న జర్నలిస్ట్ లు గత ఐదేళ్ల క్రితం అతి తక్కువే... పాలేరు, ఖమ్మం రిపోర్టర్స్ కి కలిపి కూడా ఖమ్మం రూరల్ లో ప్లాట్స్ ఇవ్వాలని ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో గ్రౌండ్ లెవెల్ జర్నలిస్ట్ లు కొంత అయోమయంలో ఉన్న మాట వాస్తవం. ఈ అయోమయాన్ని పటాపంచలు చేయడానికి, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టాము.. ఇప్పుడు వివిధ సంఘాల్లో కీలక బాధ్యతలు తీసుకున్న మిత్రులు ఆరోజు టీజేయు తో. కలిసి పోరాటం చేశారు. వారికి గుర్తే ఉండి ఉంటుంది. ఆ దీక్షల ఫలితంగా అప్పటి కలెక్టర్ లోకేష్ కుమార్ *జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాల కోసం మల్లెమాడుగులో స్థలం కేటాయించామని, ఫైల్ డిపిఆర్వో దగ్గర ఉందని, ఫైల్ తెప్పించుకుని రేపటినుంచే జర్నలిస్ట్ లకు ఇళ్లు కట్టించి అర్హులకు అప్పజెప్పే పని చేస్తామని హామీ ఇచ్చి దీక్ష విరమింప జేశారు*. వారం తర్వాత కలెక్టర్ ని వెళ్లి కలిస్తే *మీ వాళ్లే అభ్యంతరం* తెలిపారని చెప్పారు. ముందు మీరు తేల్చుకొని అందరూ కలిసి వస్తే సమస్య పరిష్కారం చేస్తామని తెలిపారు. ఈ విషయం పై అప్పుడు సోదర సంఘాలను కలిసే ప్రయత్నం చేసేలోపు, ప్రెస్ క్లబ్ లో సమావేశం పెట్టి జర్నలిస్ట్ లకు ఇళ్ళు వద్దు, ఇళ్లస్థలాలు మాత్రమే కావాలని నినాదం ఎత్తుకున్నారు. ఆ తర్వాత ఇళ్లు లేవు, ఇళ్ల స్థలాలు లేవు. ఫైల్ మరుగున పడింది. మళ్లీ ఏడాది తర్వాత *జర్నలిస్ట్ ల ఇళ్ల సాధన సమితి పేరుతో* కొందరు మిత్రులతో, పువ్వాడ, సండ్ర, భట్టి తదితర నాయకులకు వినతి పత్రాలు ఇచ్చాము. ఫలితంగా వారు అసెంబ్లీలో ప్రస్తావించారు. తీరా ఒక కీలక దశ వచ్చే లోపు అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడ అనే భిన్న ప్రతిపాదనల నడుమ జర్నలిస్ట్ ల ఇళ్ళు/స్థలాలు త్రిశంకులో నిలబడ్డాయి. అదే క్రమంలో కేటీఆర్ గారు ఖమ్మం పర్యటనలో స్పష్టమైన హామీ ఇచ్చినప్పుడు ప్రెస్ క్లబ్ లో పాలాభిషేకమ్ కోసం ప్రయత్నాలు చేసి, అమలు అయినపుడే చేద్దాం అని ఆగారు. ఇదండీ జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల సంక్షిప్త చరిత్ర (సొసైటీ కథ మినహాయించి). అయితే గతించిన గతాన్ని నెమరవేసుకునే సందర్భం ఎందుకంటే , రేపటి గమనానికి, నిన్నటి చరిత్ర నేర్పిన పాఠాలు మర్చిపోవద్దు. కలెక్టర్ శ్రీరంగం శ్రీనివాస్ గారు బిపిఎల్ కింద 75 భార్య పేరుతో, 75 గజాలు భర్త పేరుతో మొత్తం 150 గజాలు ఇస్తాం అంటే ఆరోజు ఓ సోదర సంఘం నాయకుడు మాకు బిపిఎల్ కింద వద్దు అని ఏకపక్షంగా తిరస్కరించారు. ఓ సోదర సంఘం నాయకుడు ఇళ్లు వద్దు ఇళ్ళ స్థలాలే కావాలి అని ప్రకటించారు. బహుశా ఈ నిర్ణయాలు జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అయ్యుండొచ్చు వారి దృక్కోణంలో.. కానీ ఏడు ఏళ్లుగా రెంట్ కట్టుకుంటూ ఇబ్బంది పడింది జర్నలిజపు ఆటలో పావులుగా చిక్కుకొని విలవిల్లాడే అతి సామాన్య కలం కార్మికులు. ఏ వృత్తిలో ఉపాధి లేక, ప్రత్యామ్నాయమ్ లేక ఇదే వృత్తిలో మగ్గుతున్న కొందరు మిత్రులు. వైట్ ఎలిఫెంట్ పోషణలా కొందరు. పులి మీద స్వారీ లా కొందరు. ఇలా ఈ రంగంలో మనుగడ సాగించే మిత్రులు ఇంకా ఈ విషయంలో అయోమయంలో ఉండటం గమనార్హం. నేను అనుభవం తో గుర్తించిన విషయం *కడుపు నిండిన వాడే అన్నం మెతుకుల కోసం పోరాటం చేసి, అన్నం విస్తర్లోకి రాగానే పరమాన్నం కావాలని, డొక్కలు ఎండిన వాళ్ళతో పోరాటం చేయడం* ఓ కమ్యూనిస్టు నాయకుడు నాతో అన్న మాట *కేడర్/ జనాల సమస్య పరిష్కారం అయితే మన పక్కన ఎవడుంటాడు? మన ఇళ్ల చుట్టూ ఎవడు తిరుగుతాడు* అన్నాడు. అందుకే చాలా కాలానికి స్పందిస్తున్న.. వృత్తి మారినా ప్రవృత్రి రచనా వ్యాసంగ వ్యాపకం కావున గతాన్ని, వర్తమానానికి జోడించి భవిష్యత్ కోసం ఓ సందేశం
*కేసీఆర్ గారి హామీ ఈసారి ఎన్నికల వాగ్దానం. ఇది కచ్చితంగా నెరవేరాలంటే. ఐక్యత ముఖ్యం. ఎవరూ లిస్ట్ తయారు చేయాల్సిన అవసరం లేదు. గత ఐదేళ్లకు పైగా ఈ వృత్తిలో పని చేస్తున్న వారి నుంచి కొత్తగా ఈ వృత్తిలోకి వచ్చిన వారి వరకు లిస్ట్ డిపిఆర్వో కార్యాలయంలో దగ్గర వుంది. ప్రభుత్వ స్థలమా.. లేక కొనుగోలు చేసి ఇస్తారా అనేది పక్కన పెడితే ఖమ్మానికి 10 కిలోమీటర్లు లోపు రోడ్డుకు సమీపంలో ఎక్కడిచ్చినా వృతిరేఖించకుండా తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే జర్నలిస్ట్ లు అడుగుపెట్టిన చోట అభివృద్ధి అడుగులు వేసుకుంటూ వస్తది. మరీ నెలలో ప్లాట్స్ వస్తాయని కోరుకోకున్నా కనీసం ఉగాదికి సోదర జర్నలిస్టుల ఆశలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
మీ
మిత్రుడు
అయితగాని జనార్దన్
*ఇది కేవలం సామాన్య జర్నలిస్ట్ ని దృష్టిలో పెట్టుకొని రాసిన అభిప్రాయం. ఎవరిని ఉద్దేశించిన విమర్శ కాదు* ధన్యవాదాలు
Comments
Post a Comment