రాష్ట్రంలో 90 సీట్లతో అధికారంలోకి వస్తున్నాం

 రాష్ట్రంలో 90 సీట్లతో అధికారంలోకి వస్తున్నాం



నిరుద్యోగ నిరసన ర్యాలీలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి 


కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌


కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొత్త సంవత్సరంలో 90 సీట్లతో అధికారంలోకి వస్తున్నామని జోస్యం చెప్పారు. బుధవారం సాయంత్రం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీ అనంతరం కార్నర్‌ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యులైన చైర్మన్, సభ్యులను తొలగించాలని డిమాండ్‌ చేశారు.

https://epaper.cknewstv.in/view/115/ck-news


ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలన్నారు. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో దీనిపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. 30లక్షలమంది నిరుద్యోగుల ఆశలను అడియాశలు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.1లక్ష 60వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బిశ్వాస్‌ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణలో 1లక్ష 97వేల 700 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనీ, ఈ లెక్కన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఉద్యోగాలు భర్తీ చేసిందెక్కడ అని ప్రశ్నించారు. త్వరలో రాష్ట్రానికి ప్రియాంక గాంధీ రానున్నారని తెలిపారు. 


ఎంఐఎం ఎటు పక్షమో తేల్చుకోవాలి.. 

ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్‌ తొలగించడం నీ జాగిరా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఆ పార్టీతో దోస్తీ చేస్తున్న అసదుద్దీన్‌ ఒవైసీ ఎంఐఎం ఎటు పక్షమో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.


ముస్లిం ఓట్లతో ప్రయోజనం పొందుతున్న బీఆర్‌ఎస్‌ వైపా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, సి.రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి నదీం జావెద్, సిరిసిల్ల రాజయ్య, గడ్డం వినోద్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. 


ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి 

వడగండ్లతో దెబ్బతిన్న వరిపంటకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని పీసీసీ అధ్యక్షుడురేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మామిడి రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలన్నారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీతో కలిసి ఆయన బుధవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని పొందుర్తి గ్రామ శివారులో వడగండ్ల వానతో దెబ్బతిన్న వరిపంటను, కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులను ఓదార్చారు.


ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో బీఆర్‌ఎస్‌ పార్టీ తాగుబోతు సమ్మేళనాలు నిర్వహిస్తోందని విమర్శించారు. రేవంత్‌ వెంట పీసీసీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Comments