ఓడిపోతే ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటా.. కేసీఆర్ వ్యాఖ్యల వెనక మర్మమేంటి?
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి రోజూ మూడు నియోజకవర్గాలను చుట్టేసి..
భారీ బహిరంగలతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎప్పటిలాగే పదునైన మాటలతో విపక్షాలకు విరుచుకుపడుతూనే..తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు కేసీఆర్.
మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తేనే ఈ అభివృద్ధి కొనసాగుతుందని.. కాంగ్రెస్ గెలిస్తే పరిస్థితులు మళ్లీ మొదటికి వస్తాయని అంటున్నారు. పొరపాటున వేరే పార్టీని గెలిపిస్తే..
కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లు అవుతుందని ప్రతి సభలోనూ చెబుతున్నారు. ఐతే గురువారం అచ్చంపేట సభలో ఆయన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి.
''తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు మేం పిరికెడు మందిమి. ఇప్పుడు చెప్పలేనంత సైన్యం. ఇప్పుడు మేం పోరాటాలు చేయాల్సి పనిలేదు. మీరే పోరాడాలి. కల్లిబొల్లి మాటలను నమ్మి..కవేళ మీరు ఓడగొడితే ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటాం. మాకు పోయేది ఏమీ లేదు. నష్టపోయేది ప్రజలే. చెప్పడం మా బాధ్యత.''
- తెలంగాణ సీఎం కేసీఆర్
'ఓడిపోతే మాకు పోయేదేం లేదు.. ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటాం..కానీ మీరే నష్టపోతారు.' కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఆయన వ్యాఖ్యల మర్మమేంటని ప్రజలతో పాటు అన్ని పార్టీల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ చెప్పింది 100కు 100 శాతం నిజమని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
బీఆర్ఎస్ గెలవకుంటే ప్రజలే నష్టపోతారన్న మాటలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోతున్నారు. కాంగ్రెస్ గెలిస్తే.. రైతు బంధు రాదు.. కరెంట్ రాదు.. నీళ్లు రావు.. ధరణి ఉండదు.. గతంలో ఏ కష్టాలు పడ్డామో.. మళ్లీ ఆ సమస్యలు వస్తాయని ప్రజలకు వివరిస్తున్నారు.
మరోవైపు విపక్షాలు మాత్రం కేసీఆర్ వ్యాఖ్యల ఆంతర్యాన్ని మరో విధంగా చెబుతున్నాయి. తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మరింత దూకుడు పెంచారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని.. కేసీఆర్ వ్యాఖ్యలతోనే అర్ధమవుతోందని అంటున్నారు. తమ ఓటమిని ముందే గ్రహించారని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొంటున్నారు.
ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి పప్పులేం ఉడకవని.. ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారని.. ఇంకొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Comments
Post a Comment