'రాజగోపాల్‌రెడ్డి రాజీనామా!'.. బీజేపీ నేతల స్పందన...
ఏడాది తర్వాత.. సరిగ్గా ఎన్నికల వేళ బీజేపీకి ఝలక్ ఇస్తూ కాంగ్రెస్‌లో చేరేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సిద్ధమయ్యారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదని గుర్తించానని, కాంగ్రెస్ మాత్రమేనని ప్రజలు భావిస్తున్న తరుణంలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన. ఈ పరిణామంపై తెలంగాణ బీజేపీ నేతలు వరుసగా స్పందించారు.
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పందించారు. ''ఎవరి ఊహలు వారివి. ఎవరి ఇష్టం వారిది. బీజేపీ పోటీలో లేదని వారు(రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశిస్తూ..) అనుకుంటే సరిపోతుందా?'' అని అన్నారు.
''రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఇంకా చదవలేదు. మొన్ననే బీఆర్‌ఎస్‌కు.. బీజేపీనే ప్రత్యామ్నాయమన్న రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు ఎలా మాట మార్చారు?'' అని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
అలాగే.. బీఆర్‌ఎస్ డబ్బు సంచుల్ని నమ్ముకుందని ఆరోపించిన ఈటల.. తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని.. హుజురాబాద్, గజ్వేల్ రెండు చోట్లా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
బూర నర్సయ్య గౌడ్ స్పందన..
''రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో ఉంది. ఆత్మ మాత్రం కాంగ్రెస్‌లోలోనే ఉండిపోయింది. ఇది బ్రేకింగ్ న్యూస్ ఏమీ కాదు అందరూ ఊహించినదే.
రాజగోపాల్ రెడ్డి అన్నంత మాత్రాన... బీజేపీ బీఆర్‌ఎస్‌కు ఆల్టర్నేట్ కాకుండా పోదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితిల్లో జనాలు లేరు.కేసీఆర్ ని ప్రగతిభవన్ నుంచి ఖాళీ చేయించి పనిలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు ఉన్నారు.
రాష్ట్రంలో ప్రత్యామ్నయం కేవలం బీజేపీనే. నేను పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తాను. నాకు భువనగిరి పార్లమెంటు నుంచి పోటీ చేయాలని ఉంది. కానీ పార్టీ అధిష్టానం తీసుకున్న ఏ నిర్ణయానికైనా శిరసా వహిస్తాను.
వివేక్ వెంకటస్వామి కామెంట్స్..
రాజగోపాల్ రెడ్డి రాజీనామా నాకు తెలియదు. కానీ, నేను పార్టీ మారుతానని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదంతా తప్పు. బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచే పోటీచేస్తా.
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందన..
రాజగోపాల్ రెడ్డి పాసింగ్ క్లౌడ్. . కానీ, పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుంది. నేను మాత్రం ఎంపీగానే పోటీ చేయాలనుకుంటున్నా.
లక్ష్మణ్, రాజ్యసభ ఎంపీ వ్యాఖ్యలు
పార్టీ కార్యకర్తల కృషి, శ్రమ తో మా కార్యకర్తలు రక్తాన్ని చిందిస్తున్నారు.అటువంటి బిజెపిపై ఇష్టానుసారంగా మాట్లాడడం సరైనది కాదు.
జాతీయ స్థాయి నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరి.. ఇలాంటి నిందలు వేయడం సరైంది కాదు. రాజగోపాల్ రెడ్డి కి పార్టీ జాతీయస్థాయిలో మంచి హోదాని కల్పించింది. ఆయన్ని గౌరవించి ఉన్నతమైన స్థానం కల్పించింది. అలాంటిది.. వ్యక్తిగతంగా ఇటువంటి ఆరోపణలు చేయటం సరైనది కాదు. తెలంగాణ ప్రజలు ఇదంతా చూస్తున్నారు.
Comments
Post a Comment