బాసర ఆలయంలో మరో వివాదం..
*వేల సంఖ్యలో పాడైన లడ్డూలు!*
_(అనంచిన్ని వెంకటేశ్వరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*_నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయం వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది..! రెండ్రోజులకో వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటున్న పరిస్థితి. సరస్వతి దేవి అభిషేకం లడ్డూలకు ఫంగస్ సోకిందనే వ్యవహారం ఇప్పుడు బయటపడింది.
ఫంగస్ కారణంగా వేల సంఖ్యలో లడ్డూలు పాడయ్యాయి. ఒక్కో అభిషేకం లడ్డూ ధర '100 రూపాయలు' అని అధికారులు చెబుతున్నారు._*
*_గుట్టుగా ఉంచేందుకు తీవ్ర ప్రయత్నాలు_*
ఈ విషయం బయటికి పొక్కడంతో గుట్టు చప్పుడు కాకుండా పాడైన లడ్డూలని మాయం చేసేందుకు అధికారులు ప్రయత్నించడం గమనార్హం. కొన్నింటిని చెరువులో పడేయగా.. మరికొన్నింటిని నిప్పుల్లో కాల్చేసింది సిబ్బంది. మిగిలిన కొన్నింటిని అరబెట్టేందుకు సిబ్బంది ప్రయత్నిస్తోంది. ఆలయ సిబ్బంది నిర్వాకంతో దేవాలయానికి లక్షల రూపాయిలు నష్టం వాటిల్లింది.
*_పదే పదే ఎందుకిలా..?_*
ఈనెల 20న అమ్మవారి మూలా నక్షత్రంతో పాటు.. దుర్గా దేవి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు.
ఈ ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు వచ్చి చిన్నారులకు అక్షర స్వీకార మహోత్సవాలు, అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అందుకే భారీగానే లడ్డూలను ఆలయ అధికారులు తయారు చేయించారు.
కానీ ఈ ఏడాది భక్తులు తక్కువ సంఖ్యలో రావడంతో.. ఆశించిన స్థాయిలో భారీగా లడ్డు విక్రయాలు కొనసాగలేదని తెలుస్తోంది. అందుకే లడ్డూలు మిగిలిపోవడం.. సరైన జాగ్రతలు తీసుకోకపోవడంతో ఫంగస్ వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు.. ఆలయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. అయితే.. గతంలో ఇలా లడ్డూలు పాడైన ఘటనలు చాలానే జరిగినప్పటికీ ఇప్పటికీ సిబ్బందిలో మార్పు రాకపోవడం గమనార్హం.
Comments
Post a Comment