ఉద్యోగం పేరుతో మోసం.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ఉద్యోగాల పేరిట యువతీ, యువకులు మోసపోతూనే ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ..మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు గుంజుతూ మోసాలకు పాల్పడుతున్నారు..
వారి వలలో పడి ఓ యువతి మోసపోయి ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కొత్తగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. విద్యార్థిని స్నేహితులు తెలిపినవివరాల ప్రకారం.. కొత్తగూడేనికి చెందిన కర్లపూడి సుబ్బారావు రెండో కుమార్తె కర్లపూడి మౌనిక(22) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
మౌనిక కోదాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం ఇస్తారని చెప్పి ఇటీవల ఆమెను కొందరు నమ్మించారు.
వారిమీద నమ్మకంతో ఆమె స్నేహితురాలి వద్ద రూ. 28 వేలు అప్పుగా తీసుకుంది. అవికూడా ఆన్‌లైన్‌లో స్నేహితుల కుటుంబ సభ్యుల డెబిట్ కార్డు ద్వారా చెల్లించినట్లు స్నేహితులు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తామన్న వ్యక్తుల నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు.
ఈ క్రమంలో డబ్బులిచ్చిన స్నేహితులకు సమాధానం చెప్పడంలో ఆమె మానసిక ఒత్తిడికి లోనైంది. కొంతమొత్తం చెల్లించింది. ఐనా.. ఒత్తిడి రావడంతో పాటు కళాశాల హెచ్‌వోడీ ఒకరు ఈ డబ్బుల విషయంలో జోక్యం చేసుకుని స్నేహితుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి వెంటనే ఇవ్వాలన్నారు. లేకపోతే పరీక్ష హాల్ టికెట్ ఇవ్వమని హెచ్చరించారు.
దీంతో మరింత మానసిక ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలోనే దసరా సెలవులు ప్రకటించడంతో మౌనిక ఈ మధ్యనే ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం తల్లిదండ్రులు పొలానికి వెళ్లడంతో.. విషయం ఎవరికి చెప్పలేక ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది.
చుట్టుపక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న స్నేహితులు కొత్తగూడెంలోని మృతురాలి ఇంటివద్దకు గురువారం రాత్రి చేరుకున్నారు. స్నేహితురాలి మృతికి జాబ్ ఇప్పిస్తామని మోసం చేసిన వారు, డబ్బులిచ్చి ఒత్తిడి చేసిన వారు, హెచ్‌వోడీనే కారణమంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
హెచ్‌వోడీ ఇక్కడికొచ్చి ఆమె తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతురాలి ఇంటివద్దకు చేరి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎవరి నిర్వాకమో గానీ తమ కూతురు నిండు ప్రాణాల్ని బలితీసుకుందని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నందున ఫిర్యాదునివ్వాలని మృతురాలి తల్లిదండ్రులను తాము కోరగా వారు ఇవ్వమని చెప్పినట్లు ఎస్సై సైదిరెడ్డి తెలిపారు. కొందరు కళాశాల వారి తరఫున వచ్చి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
Comments
Post a Comment