*అమ్మా! నేనేం పాపం చేసాను*
*పారేయ మనసేల వచ్చింది*
*అప్పుడే పుట్టిన పసికందు ఆక్రోశం*
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) అక్టోబర్ 21
అప్పుడే పుట్టిన ఓ పసికందును అర్థరాత్రి వీది కుక్క నోట కరుచుకొని వెళ్తుండగా స్థానికులు పాపను రక్షించడానికి చేసిన ప్రయత్నం విఫలమైన సంఘటన శుక్రవారం భువనగిరి పట్టణంలోని ఆర్ బి నగర్ లో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం అర్థరాత్రి సుమారు 11గంటల ప్రాంతంలో ఆర్ బి నగర్ నుండి రామస్వామి హోటల్ వైపుకుఓ వీధి కుక్క, అప్పుడే పుట్టిన నవజాత శిశువును నోట కరచుకొని వెళుతుండగా, స్థానికులు గమనించి పాపను రక్షించడానికి ప్రయత్నం చేశారు.
కానీ అప్పటికే పాప మృతి చెందడంతో, సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. పోలీసులు మృతి చెందిన శిశువును జిల్లా ఆసుపత్రిలో మార్చురీ లో భద్రపరిచారు. శిశువును కుక్క ఎక్కడి నుండి తీసుకువచ్చింది, ఆసుపత్రి నుండా లేక ఎవరైనా శిశువును తీసుకువచ్చి పడవేసారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు జరగడం జిల్లా కేంద్రంలో పరిపాటిగా మారిపోయింది. గత ఆగష్టు 5న జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ భవనం ముందు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో శిశువును కుక్కలు తిన్న సంఘటన మరవకముందే మరో సంఘటన చోటు చేసుకోవడం విచారకరమని పట్టణ ప్రజలు అంటున్నారు.
జిల్లాలో మూడు నెలల వ్యవధిలోనే రెండు సంఘటనలు జరగడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి(డి.ఎం హెచ్ ఓ), జిల్లా బాలల సంరక్షణ అధికారి(డి. సి. పి ఓ), జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి(డి. డబ్ల్యూ ఓ), బాలల పరిరక్షణ కమిటీ(సి. డబ్ల్యూ.సి), జిల్లా పోలీసు యంత్రాంగాలు పిల్లల కోసం పనిచేస్తున్నా ,ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం చాలా విచారకరం అని ప్రజా సంఘాల నాయకులు సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*సమగ్ర విచారణ జరిపించాలి*
కొడారి వెంకటేష్.
*పారా లీగల్ వాలంటీర్*
జిల్లా లో బాలల పరిరక్షణ,బాలల హక్కులు కాపాడుటకు కోసం ప్రత్యేక ప్రణాళికలు లేకపోవడం విచారకరమని పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్ అన్నారు. జిల్లా లో అనేక బాల్య వివాహాలు జరుగుతున్నా, బడి ఈడు పిల్లలు బాలలు బడి మానివేసి బాల కార్మికులుగా పని చేస్తున్నా, బిక్షాటన చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని ఆయన ఆరోపించారు.
జిల్లా వైద్యాధికారులు ప్రైవేటు ఆసుపత్రి పై పర్యవేక్షణ కొరవడిందని ఆయన ఆరోపించారు. ఆగష్టు లో జరిగిన సంఘటన బాధ్యులను గుర్తించడంలో పోలిసులు విఫలమయ్యారని ఆయన అన్నారు.
ఆగష్టు సంఘటన బాధ్యులను పట్టుకొని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే అక్టోబర్ లో ఈ సంఘటన జరిగేది కాదని ఆయన అన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి నేరస్తులను గుర్తించి, వారిని చట్ట ప్రకారం శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పిల్లల హక్కుల పరిరక్షణ కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాలికలతో కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు.
ఈ దేశంలో ప్రతి పౌరునికి స్వేచ్ఛగా జన్మించడం, స్వేచ్ఛగా జీవించడం, మరణించిన తరువాత కూడా గౌరవంగా దహణ సంస్కారాలు పొందే హక్కు ప్రతి పౌరునికి ఉందని ఆయన అన్నారు.
Comments
Post a Comment