ఏసీబీ వలలో లక్సెట్టిపేట మున్సిపల్ మేనేజర్
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపల్ ఆఫీసులో ఓ బాధితుడి నుంచి మేనేజర్ శ్రీహరి తరపున బిల్ కలెక్టర్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి కథనం ప్రకారం..లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలకు చెందిన ఆకుల శ్రీనివాస్ ఇదే సంవత్సరం మే నెలలో సర్వే నంబర్ 376లోని తన జాగాలో రెండు రూముల రేకుల షెడ్డు కట్టుకున్నాడు.
అదే నెలలో ఇంటి నంబర్ కోసం మున్సిపల్ ఆఫీసుకు వచ్చాడు. మేనేజర్ శ్రీహరిని కలిసి నంబర్ కోసం రిక్వెస్ట్ చేశాడు.
అయితే, ఇంటి నంబర్ తో పాటు మిగతా విషయాలు కూడా తాను చూసుకుం టానని, కానీ, రూ.లక్ష ఇవ్వాలని అడిగాడు.దీనికి శ్రీనివాస్ ఒప్పుకోలేదు. జూన్, జూలై నెలలో కూడా ఆఫీసుకు వచ్చి నంబర్ అడిగినా ఇవ్వలేదు.
సెప్టెంబర్ లో ఆఫీసుకు రాగా మేనేజర్ లేకపోవడంతో కమిషనర్‌ను కలిసి దరఖాస్తు అందజేశాడు. మళ్లీ వారం తర్వాత ఆఫీస్ కు రాగా మేనేజర్ ఉండడంతో ఆయనను కలిశాడు.
ఇలాంటి దరఖాస్తులు ఎన్నో వస్తాయని, డబ్బులు లేకుండా పని కాదని తేల్చిచెప్పడంతో వెళ్లిపోయాడు. అక్టోబర్ మొదటి వారంలో బాధితుడు శ్రీనివాస్ మేనేజర్ శ్రీహరిని బతిమిలాడుకోవడంతో చివరకు రూ.15వేలకు బేరం కుదుర్చుకున్నాడు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితుడు శ్రీనివాస్ ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం మున్సిపల్ ఆఫీసులో మేనేజర్ శ్రీహరి సూచన మేరకు ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న బిల్ కలెక్టర్ మహేందర్ కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
వీరిని కరీంనగర్ లోని స్పెషల్ కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. దాడిలో ఏసీబీ సీఐలు జాన్ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.
Comments
Post a Comment