తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి ఈటల రాజేందర్ ?

*తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి ఈటల రాజేందర్ ?*


తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కొన్ని రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసారు.


నిన్న జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ కూడా అదే ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని.. బీసీలకు పెద్దపీట వేస్తున్నది తామేనని ప్రధాని చెప్పారు.



ఇక అమిత్ షా, నరేంద్ర మోదీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటనతో.. తెలంగాణ బీజేపీలో కొత్త చర్చ మెుదలైంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే చర్చ జరుగుతోంది.


ఈ చర్చల్లో భాగాంగా ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఎంపీ బండి సంజయ్‌తో పాటు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు బలంగా వినిపిస్తున్నాయి. బండి సంజయ్ ఆర్ఎస్‌ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి. దానికి తోడు బీజేపీలో కింది స్థాయి నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడు.


ఇక ఈటల రాజేందర్ కూడా కింది స్థాయి నుంచి పైకి వచ్చాడు. అప్పటి టీఆర్ఎస్‌లో నెంబర్ 2 గా వ్యవహరించారు. ఆ తర్వాత జరిగిన పరిణా మాల్లో ఆయన బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక రాజేందర్‌కు బలమైన సామాజిక వర్గం ఉంది. దాదాపు 50 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం ఆయనకు ఫ్లస్ పాయింట్..


ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇద్దరిలో ఒకరిని సీఎం చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మంగళవారం జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ఈటల రాజేందర్‌కు ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇచ్చారు.


స్టేడియంలో ఓపెన్ టాప్ జీపులో వెళ్లే సమయంలో ఈటలను తన పక్కనే నిల్చొబెట్టుకున్నాడు. సభా వేదికపై కూడా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సీఎం అభ్యర్థి ఈటలే అని ప్రచారం జరుగుతోంది.


ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఇవాళ కీలక కామెంట్స్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీల్లోని పేద వ్యక్తి సీఎం అవుతారని ఆయన కామెంట్లు చేశారు. ఆయన కామెంట్ల వెనుక ఏదో మర్మం ఉందనే ప్రచారం జరుగుతోంది.


ఈటల రాజేందర్ బీసీ అయినా.. ఆర్థికంగా నిలదొక్కుకున్న వ్యక్తి. ఆయనకు ఫౌల్ట్రీ వ్యాపారులు, ఇతర ఆస్తులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లోనూ వాటిని వెల్లడించారు. తన ఆస్తుల విలువ రూ.53.94 కోట్లుగా ఈటల ప్రకటించారు.


ఇక బండి సంజయ్ మాత్రం తనకు సొంతిల్లు కూడా లేదని ఎన్నికల అఫిడ విట్‌లో పేర్కొన్నారు. కారు కూడా ఈఎంఐలతో కొనుగోలు చేసినట్లు చెప్పారు.


అంటే ఈ లెక్కన బండి సంజయ్ పేదవాడు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఆయన సీఎం అవుతారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే సంజయ్ ఈ కామెంట్లు చేశారనే వ్యాఖ్యనాలు వినిపిస్తున్నాయి..

Comments