లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ వేసి ‘సత్కారం'

*లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ వేసి ‘సత్కారం*

జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో ఘటన

జిల్లా మత్స్యశాఖ అధికారిపై మత్స్యకార సంఘాల సభ్యుల ఫిర్యాదు


మత్స్యకారుల ఆరోపణలను తోసిపుచ్చిన అధికారి

జగిత్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి లంచం కోసం పీడిస్తున్నాడని ఆరోపిస్తూ మత్స్యకారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి మెడలో నోట్ల దండ వేసి సత్కరించారు. 

జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అద్యక్షుడు వల్లకొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో పలు సొసైటీలకు చెందిన వారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషాను కలిసి జిల్లా మత్స్యశాఖ అధికారి దామోదర్ తీరుపై ఫిర్యాదు చేశారు.

 వివిధ మత్స్యకార సొసైటీలకు సంబంధించి ఏ పని చేయించుకోవాలన్న లంచం ఇచ్చుకోక తప్పట్లేదని వాపోయారు. సదరు అధికారి సహకార సంఘాల డైరెక్టర్లను కూడా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. 

ఈ క్రమంలో అటుగా వచ్చిన దామోదర్ మెడలో నోట్ల దండ వేశారు. అతడు దండ తీసి పడేసి తన కార్యాలయానికి వెళుతుండగా మరోమారు మత్స్యకారులు అతడి మెడలో దండ వేశారు. అయితే, మత్స్యకారుల మధ్య గొడవలతోనే వారు తనపై ఆరోపణలు చేస్తున్నారని దామోదర్ చెప్పుకొచ్చారు.

Comments