తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్లకు గడువు బుధవారం సాయంత్రంతో ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి ఒకే ఒక నామినేషన్ దాఖలు అయింది.
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం ప్రసాద్ అసెంబ్లీ స్పీకర్గా నామినేషన్ వేశారు. రేపు సభలో ప్రొటెం స్పీకర్ అధికారికంగా అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించనున్నారు.
ఉదయం అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉండడంతో స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యూల్, తదితరులు పాల్గొన్నారు. రేపు స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవం కానున్నారు. 15న అసెంబ్లీ, మండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 16న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం చేయనున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గడ్డం ప్రసాద్ రాజకీయ ప్రస్థానం 2008లో మొదలయ్యింది. ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఓడిపోయారు. ఓటమితో పార్టీ మారలేదు. నియోజకవర్గాన్నీ మార్చలేదు. వికారాబాద్ నే అంటిపెట్టుకుని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2008లో తొలిసారిగా వికారాబాద్ నుంచి గెలుపొందిన ఆయన 2009లో మళ్లీ వికారాబాద్ నుంచి గెలుపొందారు. 2014, 2018లో వికారాబాద్ నుండి రెండుసార్లు ఓడిపోయారు. కానీ 2023లో మళ్లీ గెలిచారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 3వ స్పీకర్గా ఎన్నికయ్యారు.
2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. టెక్స్ టైల్ శాఖా మంత్రిగా సేవలందించారు.రాష్ట్ర విభజన, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కూడా ఆయన పరాజయాన్ని చవిచూశారు. 2018 తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ నియమితులయ్యారు. ఆ తర్వాత 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ కుమార్ విజయాన్ని సాధించి స్పీకర్గా నియమితులయ్యారు.
Comments
Post a Comment