వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో తల్లాడకు ఈసారైనా చోటు దక్కేనా...

 *వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో తల్లాడకు ఈసారైనా చోటు దక్కేనా..* 

 *చైర్మన్ రేసులో వడ్డే రామారావు,  నాగిరెడ్డి, మల్లికార్జున్ రావు, జోసెఫ్..* 

జనవరి,18 తల్లాడ, సీకే న్యూస్ ప్రతినిధి, విజయ్

 *వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఈసారైనా తల్లాడ మండలానికి దక్కుతుందో.. లేదోనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైరా మార్కెట్ కమిటీ యార్డు పరిధిలోని వైరా, కొనిజర్ల, తల్లాడ మండలాలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు, మూడు దఫాలు చైర్మన్ పదవి వైరా మండలానికి కేటాయించారు. 


తల్లాడకు వైస్ చైర్మన్, కొనిజర్లకు డైరెక్టర్ల పదవులను కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ఈసారైనా తల్లాడ మండలానికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కుతుందని పలువురు నాయకులు ఆ పదవిపై ఆశలు పెట్టుకుంటున్నారు. మార్కెట్ పరిధిలో వైరా నియోజకవర్గంలో పాటు సత్తుపల్లి నియోజకవర్గంలో తల్లాడ ఉన్నాయి. 

గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు తల్లాడ నుండి మార్కెట్ చైర్మన్ గా దీవెల కృష్ణయ్య, దుండేటి వీరారెడ్డి తదితరులు పదవులు దక్కిన సంఘటనలు  ఉన్నాయి. ఈసారి మరలా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ చైర్మన్ పదవిపై తల్లాడ మండల నాయకులు ఆశలు పెట్టుకున్నారు.

 తల్లాడ మండలం నుండి సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి దయానంద్ అనుచరులుగా కొంతమంది నాయకులు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం నుండి కలకోడిమ గ్రామానికి చెందిన వడ్డే రామారావు, అన్నారుగూడెం గ్రామానికి చెందిన మారేళ్ళ మల్లికార్జున రావుతో పాటు రెడ్డి సామాజిక వర్గం నుండి తల్లాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దగ్గుల నాగిరెడ్డి రేసులో ఉన్నారు. 

అంతేకాకుండా ఎస్సీ సామాజిక వర్గం నుండి తాళ్ల జోసెఫ్ ఆశలు పెట్టుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నలుగురు ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరులుగా ఉంటూ వారి గెలుపు కోసం నిరంతరం శ్రమించారు. దీంతో వీరు ఈ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం వైరా మార్కెట్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తల్లాడ మండలానికి చైర్మన్ పదవి దక్కటం వారికి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. కానీ ఈ చైర్మన్ పదవి ఈసారి తల్లాడ మండలానికి దక్కుతుందో.. లేదోనని తెలుసుకోవడానికి మరికొద్ది కాలం వేచి చూడాల్సిందే.*

Comments