గిరిజన నేత దారుణ హత్య
ఓ గిరిజన కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని కుమ్మర్‌పల్లి పంచాయతీ అనుబంధ గ్రామం బోజ్యానాయక్ తండా సమీపంలోని కొత్త చెరువు అలుగు వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
ఘటనా స్థలిని శనివారం వికారాబాద్ డీఎస్‌పీ శ్రీనివాస్‌రెడ్డి, ధారూరు సీఐ రఘురాం, ఎస్‌ఐ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. పంచనామా చేసి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది సహకారంతో వివరాలు సేకరించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ నిర్వహిస్తున్న వడ్‌త్యా పండరి(34) శుక్రవారం ఉదయం అక్కడ నుంచి తన భార్యకు ఫోన్ చేసి స్వగ్రామానికి వెళ్తున్నట్లు చెప్పాడు. అదేరోజు మధ్యాహ్నం వరకు తండాలో విందు చేసుకుని సాయంత్రం వికారాబాద్ వెళ్లాడు. అక్కడ మాంసం తీసుకుని తిరిగి తండాకు చేరుకున్నాడు. వదినకు కూర వండమని చెబుతుండగా ఫోన్ రావడంతో మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయిన వ్యక్తి శనివారం తెల్లవారుజామున కొత్తపల్లి చెరువు అలుగు కింద శవంగా తేలాడు. అటుగా వెళ్లిన స్థానికులు పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకి చేరకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ముందుగా తండా సమీపంలోని సంజప్పదరి వద్దకు పరగుతీయడంతో పోలీసులు అక్కడ విందు చేసుకున్న ఆనవాళ్లు గుర్తించారు. విందులో పాల్గొన్న వారే వెనుక నుంచి వచ్చి దాడి చేసి హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. శవం వాసన చూసిన అనంతరం డాగ్ స్క్వాడ్ చెరువు పరిసరాల్లో తచ్చాడుతూ చివరకు రోడ్డుపైకి ఎక్కింది. హంతకులు హత్యానంతరం అక్కడ నుంచి వేరే వాహనంలో పరారీ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఘటనా స్థలిలో గాజులు గుర్తించిన క్లూస్ టీం సిబ్బంది వివాహేతర సంబంధమేమైనా ఉందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. భార్య దివ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన వ్యక్తులు ప్రమాదంగా చిత్రీకరించేందుకు బైక్‌ను అక్కడ పడేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటికే అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
మూడు రోజులు తండాలో
కాంగ్రెస్ నేత పండరి 2009లో నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతానికి చెందిన దివ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ స్థలాన్ని లీజుకు తీసుకుని అక్కడే మకాం పెట్టాడు. వీరికి పదోతరగతి చదువుతున్న కుమారుడు పవన్ సంతానం. బోజ్యానాయక్‌తండాలో వ్యవసాయం సైతం చేస్తుండడంతో వారంలో మూడు రోజులు తండాలో నాలుగు రోజులు హైటెక్‌సిటీలో ఉంటాడని తండా వాసులు తెలిపారు. 2018లో కాంగ్రెస్ నుంచి సర్పంచ్‌గా ఓటమిపాలయ్యాడు. మరోసారి పోటీకి సిద్ధమవుతుండగా హత్యకు గురయ్యాడు.
రాజకీయ కక్షలా.. వివాహేతరసంబంధమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పోలీసుల అదుపులో అనుమానితులు?
Comments
Post a Comment