కనకవర్షం కురుస్తుందని.. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినితో నగ్న పూజలకు యత్నం
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్నపూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది.
పొరుగు జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని, తన సోదరితో కలిసి మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటున్నది. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న హాస్టల్‌లో పనిచేసే వంట మనిషి ఆ ఇద్దరు విద్యార్థులను చేరదీసినట్టుగా నటిస్తూ.. పెద్దమ్మాయికి మాయ మాటలు చెప్పింది. నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుంది. ఆ డబ్బుతో మీ కుటుంబం సంతోషంగా ఉండవచ్చు' అని చెప్పింది. వారం క్రితం వంట మనిషి పర్సనల్ రూంకు ఓ వ్యక్తిని తీసుకువచ్చి బాలికను పిలిపించి అతని ముందర నగ్నంగా ఉంటే ప్రత్యేక పూజ లు చేస్తారని చెప్పింది.
దీంతో ఆ విద్యార్థిని భయంతో హాస్టల్ నుంచి మంథని పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి నాలుగు రోజులుగా తలదాచుకున్నది. తల్లిదండ్రులకు విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు హాస్టల్ వద్దకు వచ్చి సదరు వంట మనిషిని నిలదీశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా సీఐ రాజు, ఎస్‌ఐ రమేశ్ చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ప్రలోభ పెట్టిన మహిళను అదుపులోకి తీసుకొని, పోలీసు స్టేషన్‌కు తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు మంథని ఎస్‌ఐ తెలిపారు. పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకోనున్నట్టు వివరించారు.
Comments
Post a Comment