రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో (Rangareddy District) సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది
హైదరాబాద్ - బీజాపూర్ రహదారి వద్ద దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా.. వారిపైకి ఓ లారీ అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందగా.. 10 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దూసుకొస్తోన్న లారీని చూసిన వ్యాపారులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. వ్యాపారులపైకి దూసుకెళ్లిన అనంతరం లారీ చెట్టును ఢీకొని ఆగిపోగా.. డ్రైవర్ మాత్రం క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. లారీ వేగంగా ఢీకొట్టడంతో చెట్టు నేలకూలింది. ఈ ఘటనతో రహదారిపై భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు రాములు (ఆలూరు), ప్రేమ్ (ఆలూరు), సుజాత (ఖానాపూర్)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment