ఆర్టీసీ బస్సులో తాగుబోతు వీరంగం.. పొట్టు పొట్టు కొట్టిన యువతులు
ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. బస్సులో ఉన్న అమ్మాయిలతో అసైభ్యంగా ప్రవర్తిస్తూ వారిపై దాడికి యత్నించాడు. దాంతో ఆ యువతులంతా కలిసి ఆ తాగుబోతుకు తగిన శాస్తి చేశారు.
బూతులు తిట్టాడు. దీంతో ఆ యువతులు కూడా ఎదురుతిరిగారు. అతడ్ని కాలితో తన్నడంతోపాటు కర్రతో కొట్టి బుద్ధి చెప్పారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వీరంగం సృష్టించాడు. వేములవాడ నుంచి సిద్దిపేటకు వెళుతున్న ఆర్టీసీ బస్సు.. సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఆగిన సమయంలో మద్యం సేవించి బస్సులో ఎక్కాడు.
తంగళ్లపల్లి మండలం సారంపల్లి మీదుగా బస్సు వెళుతున్న సమయంలో యువతులతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.
దీంతో ఎందుకిలా చేస్తున్నావంటూ ఆ తాగుబోతును ప్రశ్నించారు. ఈ క్రమంలో సదరు తాగుబోతు అమ్మాయిలపై దాడికి దిగాడు. కాలితో తన్నుతూ జుట్టు లాగుతూ వీరంగం సృష్టించాడు.
దీంతో యువతులు కూడా ఎదురుతిరిగి అతడ్ని అడ్డుకున్నారు. కాలితో తన్నారు. ఇదంతా గమనించిన బస్సు డ్రైవర్.. బస్సు ఆపి, అతడ్ని నేరేళ్ల గ్రామంలో దింపివేశాడు.
బస్సు దిగిన తర్వాత కూడా సదరు తాగుబోతు దూషించడంతో యువతులు మరోసారి అతడ్ని చితకబాదారు.
ఓ అమ్మాయి కర్రతో అతడ్ని కొట్టింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి సదరు తాగుబోతును అక్కడ్నుంచి పంపివేశాడు.
కాగా, ఇందుకు సంబంధించిన ఉదంతాన్ని బస్సులోని వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో తాగుబోతును ఎదుర్కొన్న సదరు యువతుల ధైర్యానికి మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Post a Comment